సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల

సత్తెనపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 8:28 PM IST
ys sharmila, comments, andhra pradesh, police,

సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ముమ్మరంగా తిరుతున్నాయి. సభలు, ర్యాలీలు, యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పిదాలను విపక్షపార్టీలు ఎత్తి చూపుతుంటే.. వాటికి సమర్ధంగా అధికార పార్టీ వైసీపీ బదులు ఇస్తోంది. ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల దూసుకెళ్తున్నారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సత్తెనపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వైఎస్ షర్మిల ఒక పోస్టు పెట్టారు.

రాష్ట్రంలో పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపే వారిని గొంతు పిసికి చంపేస్తారా అని నిలదీశారు. వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా అన్నారు వైఎస్ షర్మిల. మీరు పోలీసులా లేదంటే వైసీపీ కిరాయి మనుషులా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరు ఇచ్చారు హక్కు అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి సంఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలనీ.. విచక్షణారహితంగా దాడి చేసిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


Next Story