గుర్లలో పరిస్థితులు దారుణం.. 14 మంది చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపే లేదు: వైఎస్ జగన్
విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 24 Oct 2024 1:38 PM ISTగుర్లలో పరిస్థితులు దారుణం.. 14 మంది చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపే లేదు: వైఎస్ జగన్
విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మృతుల కటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వానంగా మారాయన్నారు. 14 మంది డయేరియాతో చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపులేదని మండిపడ్డారు. ఈ నెల 19న తాను ట్వీట్ చేసే వరకూ ప్రభుత్వం స్పందించలేదన్నారు. మృతుల సంఖ్యపైనా మంత్రులు, అధికారులు తలోమాట చెప్పారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ఆస్తి పంపకాలపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేస్తోన్న విమర్శలపై జగన్ మాట్లాడుతూ.. ''తన తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ చేస్తున్నారు. మా కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? ఇవన్నీ అన్నీ ఇళ్లల్లో ఉండేవే. పాలన వదిలేసి డైవర్షన్ కోసం తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా?'' అని ప్రశ్నించారు.
అటు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇబ్బంది కలగడంపై వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు కనీసం కో ఆపరేట్ చేసే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితిని కల్పించకపోతే ఎలా? కనీసం భద్రత ఇవ్వకపోతే ఎలా? పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని ఆగ్రహించారు. స్థానికులు, కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో 'మాట్లాడొద్దంటే వెళ్లిపోతా' అని అన్నారు.