మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు(ఆదివారం) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారణకు హాజరు అయ్యారు. తన అనుచరులతో కలిసి ఆయన కడప సీబీఐ అతిథి గృహానికి వచ్చారు. అయితే.. విచారణ అధికారి లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విచారణ తేదీ మళ్లీ తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. "సీబీఐ విచారణ కోసం ఈ రోజు పిలిచారు. ఆరోగ్యం సహకరించకపోయినా విచారణకు వచ్చాను. విచారణ అధికారి అందుబాటులో లేరు. మరోసారి నోటీసు ఇచ్చి పిలుస్తామన్నారు. అన్నింటికి సిద్ధంగా ఉన్నా. అరెస్టు చేసుకుంటే చేసుకోండి. హత్యా స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయట్లేదు. ఆ లెటర్ గురించి తెలిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. లెటర్ లేకుండా ఏ దర్యాప్తు సంస్థ కూడా కేసును పూర్తి చేయలేదు." అని వైఎస్ భాస్కర్ రెడ్డి అన్నారు.