కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ఇక మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు విదేశాలకు చెందిన వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. విదేశాల్లో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ కారణంగా మరణించారంటూ వార్తలు వినిపించాయి. అయితే..వారు ఇతర తీవ్రమైన అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వికటించి 19 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ నెల 21 న పాలకొల్లులో సూర్య తేజ అనే యువకుడు వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్న గంటలో వాంతులతో సూర్య తేజ పడిపోవడంతో అతడిని హుటాహుటిన స్దానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు పాటు వెంటిలేటర్ పై పోరాడిన సూర్యతేజ తుదిశ్వాస విడిచాడు. సూర్యతేజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తల్లి తండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.