ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత
Yerran Naidu children park demolished in Narasannapet.దివంగత తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు పేరుతో
By తోట వంశీ కుమార్ Published on 27 March 2022 12:36 PM ISTదివంగత తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు పేరుతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణదశలో ఉన్న చిల్డ్రన్స్ పార్కును కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామున రెండు జేసీబీలతో పడగొట్టారు. విషయం తెలిసి అక్కడికి చేరుకుని అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా వారిపై దాడికి తెగబడడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీలో ఎర్రన్నాయుడు పేరిట చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నిధులు కూడా మంజూరు చేశారు. ఈ క్రమంలో నిర్మాణం చేపట్టారు. అయితే.. నిన్న కొందరు వ్యక్తులు రెండు జేసీబీలతో అక్కడకు చేరుకుని నిర్మాణంలో ఉన్న పార్కును కూల్చివేశారు. పార్కు ప్రహరీ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతోపాటు అంతర్గతంగా వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతను అడ్డుకున్నారు. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రమణమూర్తితోపాటు పాటు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపి ధర్నాకు దిగారు.
ఈ పార్కు నిర్మాణానికి రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. అయితే, ఈ స్థలం తమదేనంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా జరగకుండా ఆగిపోయాయి.