దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మరో ప్రముఖ వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో రాఘవను ప్రశ్నించాక అరెస్ట్ చేసినట్లు తెలిపింది. నేడు(శనివారం) మధ్యాహ్నాం అతడిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కస్టడీకి అనుమతి కోరే అవకాశం ఉంది.
ఈ కేసులోనే మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయిదు రోజు పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్.. బుచ్చిబాను మూడు రోజు కస్టడీకి ఇస్తూ ఉత్వర్తులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు కస్టడీ నేటితో ముగియనుండంతో అతడిని ఈరోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.