ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి(34) అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్గుమెంట్‌లోని 101 ప్లాట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా.. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ప్లాట్‌కు వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెలుతుంటారని స్థానికులు చెబుతున్నారు. అలాగే మూడు రోజుల క్రితం ఇక్కడకు రాగా.. శుక్రవారం రాత్రి శవమై కనిపించారు. ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతుండగా.. అక్కడ పరిస్థితులు అనుమానాస్పదంగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె మంజునాథరెడ్డి స్వగ్రామం. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని, వైసీపీ నేత మహేశ్వరరెడ్డి ఆయన తండ్రి. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన విజయవాడ బయలుదేరారు. ముంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు.
కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందకపోవడంతో కొద్ది రోజులుగా తన కుమారుడు మానసిక ఒత్తిడికి గురైయ్యాడని అన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.