దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏపీలో సామాజిక న్యాయం అమలవుతున్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్, కోల గురువులు, ఇజ్రాయెల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం గురవారం నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సజ్జల పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం అబద్ధపు హామీలకే పరిమితమైందని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించలేదన్నారు. సీఎం జగన్ సామాజిక సాధికారత చూపిస్తున్నారని, మూడున్నరేళ్లలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని సజ్జల అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు సజ్జల తెలిపారు. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మకమని అన్నారు. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.