భరోసా ఇచ్చిన సిఎం జగన్.. తప్పుడు లెక్కలు అంటున్న చంద్రబాబు
Words War Between Jagan And Chandrababu. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే
By Medi Samrat Published on 28 April 2021 6:23 PM ISTకరోనా సమయంలో పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని, అది రాష్ట్రాల విచక్షణకు సంబంధించిన విషయం అని కేంద్రం చెప్పిందని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్ కు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని.. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు అందించే సర్టిఫికెట్లపై కేవలం పాస్ అనే ఉంటుందని, పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుంటే విమర్శలు చేస్తున్నారని, విపత్కర సమయంలోనూ అగ్గిరాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పనే అని... కష్టమైనా, నష్టమైనా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నామని జగన్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి నష్టపోని రీతిలో పరీక్షల నిర్వహణ ఉంటుందని, ఈ విషయంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. కరోనాపై ప్రతి అంశంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. రోజువారీ కేసుల సంఖ్య 12 వేలకు చేరువైందని, టెస్టుల సంఖ్య తగ్గించడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటిందని, 7 వేల మందికి పైగా చనిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఓవైపు ప్రజలు కరోనా మహమ్మారికి బలైపోతుంటే, ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలపై ఎదురుదాడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 25.8 శాతంగా ఉందని, దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆరోగ్యశ్రీ కరోనా రోగులకు వర్తింపజేయడంలేదని చంద్రబాబు ఆరోపించారు. కరోనా రోగుల చికిత్సలో మార్గదర్శకాలను ఎక్కడా పాటించడంలేదని, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు.