కదులుతున్న రైలులో కాన్పు.. శభాష్ మెడికల్ స్టూడెంట్
Woman gave birth to a baby girl in duranto experss. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణీకి మెడిసన్ చదువుతున్న
By అంజి Published on 14 Sep 2022 4:28 AM GMTసికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణీకి మెడిసన్ చదువుతున్న విద్యార్థిని చేసిన సాయం.. అందరి చేత శభాష్ అనిపిస్తోంది. దురంతో రైలులో నెలలు నిండక ముందే నొప్పుల రావటంతో ప్రసవం జరిగింది. పురుడు పోసుకునేందుకు పుట్టింటికి రైల్లో బయలుదేరిన మహిళకు నొప్పులు రావడంతో ఓ వైద్య విద్యార్థిని పురుడు పోసి మానవత్వాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ - విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం తెల్లవారుజామున ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మహిళ, ఆమె భర్త సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి తిరిగి విశాఖపట్నం వెళ్తున్నారు. అదే రైలులో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ డాక్టర్ స్వాతి కేసరి ఆ మహిళకు బిడ్డను ప్రసవించేందుకు సహకరించారు. ''ఇది తెల్లవారుజామున 3:30 జరిగింది. ప్రసవ నొప్పితో బాధపడుతున్న తన భార్యకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. నేను మెడిసన్ చదువుతున్నానని అతనికి తెలియదు. కంపార్ట్‌మెంట్‌లోని మరో ఇద్దరు మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసుల సహాయంతో.. మహిళ ఉదయం 5:35 గంటలకు సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది.''అని స్వాతి చెప్పారు.
''గతంలో నేను డెలివరీ సమయంలో నా ప్రొఫెసర్‌లు, తోటి వైద్యులకు సహాయం చేశాను. కానీ నేను ఏ పరికరాలు లేకుండా ఒంటరిగా డెలివరీ చేయడం ఇదే మొదటిసారి. డెలివరీ టైమ్‌లో నేను టెన్షన్‌గా ఉన్నాను. కానీ సురక్షితమైన డెలివరీ తర్వాత నాకు చాలా సంతోషం వేసింది.'' అని స్వాతి చెప్పారు. పోలీసులు అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మహిళను, అప్పుడే పుట్టిన బాలికను ఎన్టీఆర్ ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు. నవజాత బాలికకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తామని అనకాపల్లి స్టేషన్‌మాస్టర్ ప్రకటించారు. గీతం వైద్య కళాశాల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు డాక్టర్ స్వాతి ఆమె వీరోచిత చర్యను అభినందించారు.