ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మీద చర్యలు తప్పవని అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎస్‌ఈసీ పరిధిని దాటి, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. మంత్రులు బోత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్మణరేఖ దాటి మాట్లాడుతున్నారని ఇటీవల నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రులు ఇద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులకు భంగం కలిగించేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రివిలేజ్‌ కమిటీ చర్చించింది.

ఈ సందర్భంగా నెల్లూరులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఎస్‌ఈసీగా నిమ్మగడ్డకు కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ వెంటనే ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


అలాగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పరిమితికి మించి ఏకగ్రీవాలు అయ్యాయని, వాటిని నిలుపుదల చేయాలని, ఇప్పుడే ఏకగ్రీవాల జాబితా ప్రకటించవద్దని నిమ్మగడ్డ రమేష్‌ అధికారులను ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ చెప్పినట్లు ఏకగ్రీవాలను తిరస్కరిస్తే వారిని బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన నిమ్మగడ్డ మంత్రిని ఇంటికి పరిమితం చేయాలని, ఆయనను గృహ నిర్బంధం చేయాలని, అలాగే మీడియాతో కూడా మాట్లాడవద్దని డీజీపిని నిమ్మగడ్డ ఆదేశించారు.

ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టివేసింది. కాగా, నిమ్మగడ్డపై అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఏం చేస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశిస్తుందా...? లేదా పిలిస్తే ఆయన వెళ్తారా...? లేదా ? రాజ్యాంగబద్దమైన పదవి, అది కూడా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్‌ఈసీని పిలిపి ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్‌ కమిటీకి ఉందా..? అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
సామ్రాట్

Next Story