చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇచ్చిన వాలంటీర్‌.. ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Volunteer gives Pension to Death woman.చ‌నిపోయిన మ‌హిళతో వేలిముద్ర వేయించి ఫించ‌న్ ఇచ్చాడో వాలంటీర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 9:36 AM IST
Volunteer gives Pension to Death woman

సినిమానే త‌ల‌ద‌న్నే సీన్ ఇది. ఠాగూర్ సినిమాలో చ‌నిపోయిన వ్య‌క్తికి వైద్యం చేసి డ‌బ్బులు లాక్కుంటే.. చ‌నిపోయిన మ‌హిళతో వేలిముద్ర వేయించి ఫించ‌న్ ఇచ్చాడో వాలంటీర్‌. మెప్పుకోసం ప్ర‌య‌త్నించి చివ‌రికి అభాసుపాల‌య్యాడు ఆ వాలెంటీర్. విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలోని గుర్ల మండ‌లం గుర్ల గ్రామంలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించారు.

కాగా.. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తినెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వ‌ద్దే వృద్దుల‌కు ఫించ‌న్ అందిస్తోంది. గుర్ల గ్రామంలో ఇజ్జిరోతు త్రీనాథ్ వాలంటీర్‌గా ప‌నిచేస్తున్నాడు. సోమవారం ఒకటో తేదీ కావడంతో త్రినాథ్ పింఛను పంపిణీ చేసేందుకు ఎర్ర నారాయణ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో అక్క‌డికి వెళ్లిన త్రినాథ్‌.. ఎర్ర నారాయ‌ణమ్మ చ‌నిపోయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే ఆమెకు ఫించ‌ను మంజూరైంది కాబ‌ట్టి ఇవ్వ‌డం త‌న విధి అని ఆమెతో వేలి ముద్ర వేయిస్తే చాల‌ని కుటుంబ స‌భ్యుల‌తో చెప్పాడు.

ఇందుకు కుటుంబ స‌భ్యులు అంగీక‌రించి ఆమె వేలిని బ‌యోమెట్రిక్ ప‌రిక‌రంపై ఉంచి వేలి ముద్ర వేయించారు. చనిపోయిన వృద్దురాలికి పించ‌ను ఇస్తున్న‌ట్లు.. వేలి ముద్ర‌లు తీసుకుంటున్న‌ట్లుగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చనిపోయిన ఎర్ర నారాయణమ్మ కుటుంబసభ్యులు ఈ ఘటనపై స్పందించారు. వాలంటీర్ ఇంటికి వచ్చినప్పటీకే ఆమె చనిపోయింది. అయితే ఆమెకు ఈ నెల ఫించన్ మంజూరైందని.. ఇచ్చేసి వెళ్తానని వాలంటీర్ చెప్పారు. ఆమె చేత వేలి ముద్రలు వేయిస్తే చాలని చెప్పారు. మృతదేహంతో వేలి ముద్రలు తీసుకోవడం సరైనది కాదని మాలో కొందరు ఆయనతో చెప్పాం. అయితే, చనిపోవడానికి ముందే పింఛను మంజూరైందని చెప్పి వేలి ముద్రలు తీసుకుని వెళ్లారన్నారు.

చనిపోయిన వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేశారనే విషయం తెలుసుకున్న అధికారులు సమాచారం సేకరించారు. డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు ఈ ఘటనపై స్పందించారు. చనిపోయిన వ్యక్తికి ఫించన్ మంజూరు చేయడం తప్పు. అసలు మృతదేహం నుంచి వేలి ముద్రలు సేకరించరాదు. వాలంటీర్ వివరణ కోరాం. నేను నిజాయితీగానే ఆమె డబ్బు ఆమెకు ఇచ్చాను అని చెప్పారు. వాలంటీర్ అత్యుత్సాహంతో చేసిన పనిలాగే కనపడుతుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. గుర్ల ఎంపీడీవో‌ను విచారణ అధికారిగా నియమించాం అని పీడీ సుబ్బారావు మీడియాతో చెప్పారు.




Next Story