విజయనగరం రైలు ప్రమాదానికి కారణాలేంటి..? బాలాసోర్ ప్రమాదం తరహాలోనే...
బాలాసోర్ యాక్సిడెంట్‌కు విజయనగరం వద్ద జరిగిన యాక్సిడెంట్‌కు దగ్గర పోలిక ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 11:03 AM ISTవిజయనగరం రైలు ప్రమాదానికి కారణాలేంటి..? బాలాసోర్ ప్రమాదం తరహాలోనే...
విజయనగరం వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే గతంలో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదాన్నే తలపిస్తోంది. ఆ ప్రమాదానికి విజయనగరం వద్ద జరిగిన యాక్సిడెంట్‌కు దగ్గర పోలిక ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.
కొన్నాళ్లుగా దేశంలోని పలు చోట్ల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణమంటేనే వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ ప్రమాదం జరిగింది. ఇప్పుడు తాజాగా అలాంటి ప్రమాదమే విజయనగరం జిల్లాలో చోటుచేసకుంది. విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు నంబర్ (08504).. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు (08532)ను ఢీకొంది. దాంతో.. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక రెండు కోచ్‌లు, విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఇంజన్ పట్టాలు తప్పాయి. విజయనగరం నుండి రాయగడకు ప్రయాణీకులతో పాటు ప్రయాణిస్తున్న రైలు విశాఖపట్నం నుండి పలాసకు అదే మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంతో పలాస పాసింజర్ బోగీలు ఎగిరిపడి పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్‌పై పడ్డాయి. గూడ్స్‌కు చెందిన మరికొన్ని బోగీలు కూడా ఎగిరి పడ్డాయి. మొత్తంగా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయిపోయాయి. అధికారుల అనుమతితోనే మధ్యలైన్‌లో పలాస ప్యాసింజర్ రైలును నిలుపుదల చేశారు. మరి అదే మార్గంలో మరో రైలుకు ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్నగా మారింది. ఇది మానవ తప్పిదమా..? లేదంటే సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిందని కూడా వినిపిస్తోంది. మరి ఆ సమాచారాన్ని వెనక నుంచి వచ్చిన ట్రైన్‌కూ ఇవ్వాలి.. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. పలాస ప్యాసింజర్ రైలును మధ్య లైన్‌లో ఎందుకు నిలిపారనే అనుమానాలు వస్తున్నాయి. సాంకేతిక కారణాలతో నిలిపారా లేదంటే ..ముందు స్టేషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా అనే కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది.
ఈ ఏడాది జూన్‌లో ఒడిశా బాలాసోర్‌లో కూడా ఇలాంటి అత్యంత విషాదకర సంఘటనే జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. స్టేషన్ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ లోపాలు కారణంగా ప్రమాదం జరిగింది. బాలాసోర్‌లో సిగ్నలింగ్ లోపంలో కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. 293 మంది చనిపోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒడిశా ప్రమాదం ఒకటి.