వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కొన్ని సాంకేతిక సమస్యలతో గురువారం రద్దు చేశారు.
By అంజి Published on 17 Aug 2023 10:02 AM ISTవైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కొన్ని సాంకేతిక సమస్యలతో గురువారం రద్దు చేశారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆకస్మికంగా సర్వీస్ రద్దు చేయడంతో వందే భారత్ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సి ఉందని ఉదయం 5 గంటలకు రద్దు చేసినట్లు తమకు సమాచారం అందిందని ప్రయాణికులు తెలిపారు. అయితే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్న అదే మార్గంలో మరో ప్రత్యేక రైలును నడుపుతూ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
"అసౌకర్యానికి చింతిస్తున్నాము" అని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అన్నారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరింది డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ విశాఖపట్నం స్టేషన్ లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రయాణీకులు తమ సౌకర్యార్థం ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక రైలులో క్యాటరింగ్ సేవలు అందించినట్లు డీఆర్‌ఎం ప్రకటించారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వందేభారత్ స్టాపుల్లోనే ఈ రైలు ఆగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. వందేభారత్ రద్దు దృష్ట్యా మరోట్రైన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఆయా స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని రైల్వే సూచించింది.