Viveka Murder case: 'ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఆదేశించండి'.. అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు

By అంజి  Published on  9 March 2023 5:15 PM IST
Viveka murder case, MP Avinash Reddy

'ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఆదేశించండి'.. అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తను విచారించే సమయంలో సీబీఐ అధికారులు ఆడియో, వీడియోను షూట్‌ చేయాలని తన పిటిషన్‌లో కోరారు. విచారణకు తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరారు. అలాగే సీబీఐ నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ కాపీని తనకు ఇచ్చేలా ఆదేశించాలని కోరును కోరారు. అలాగే సీబీఐ అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్టు చేయలేదని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌ తెలిపారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని, దస్తగిరి చెప్పుడు మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో తనను ఇరికించాలనే కుట్ర జరుగుతోందని అవినాష్‌ ఆరోపించారు. వివేకా హత్యకేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందన్నారు. హత్య ఎలా జరిగిందో ముందే నిర్ణయించుకొని, ఆ పాయింట్‌లోనే విచారణ చేస్తున్నారని అన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణ అధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాష్‌రెడ్డి ఆరోపించారు.

Next Story