కేంద్ర మంత్రి సమాధానంతో విశాఖ ఉక్కు ఆందోళన ఉద్దృతం.. రాత్రి నుంచి రోడ్డు పైనే కార్మికులు, నిర్వాసితుల నిరసన
Visakhapatnam steel plant protests intensified amid centre's comments in Parliament.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం
By తోట వంశీ కుమార్ Published on 9 March 2021 10:16 AM ISTవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు.. కార్మికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. విశాఖలో రాత్రి నుంచి ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కేంద్ర ప్రకటనతో ఉన్న ప్రతులను దహనం చేశారు. నేడు విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఎన్నో ఉద్యమాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని సాధించుకున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆర్థిక పరంగా, ప్రజల మనోభావాలకు సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత చాటుకుందని వివరించారు. పరిశ్రమను ప్రైవేటికరణ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో సీపీఐ ఆందోళన చేస్తోందన్నారు. కేవలం ఉత్తరాలతో న్యాయం జరగదని చెప్పినా ముఖ్యమంత్రి జగన్ పెడచెవిన పెట్టారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్ణయంపై సీఎం నైతిక బాధ్యత వహించాలని నారాయణ డిమాండ్ చేశారు.
100 శాతం అమ్మేస్తాం.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ :
సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని, వంద శాతం అమ్మేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్టు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం వల్ల ఆ సంస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి, సామర్థ్యం పెంచడానికి, కొత్త సాంకేతికతలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు తీసుకురావడానికి అవసరమైన మూలధనం సమకూర్చుకోవడానికి వీలవుతుందని మంత్రి తెలిపారు.
దీని వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వృద్ది చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వాముల న్యాయబద్దమైన సమస్యలను తగిన విధంగా పరిష్కరించడానికి ప్లాంటు వ్యూహాత్మక విక్రయ విధివిధానాల ఖరారు సమయంలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని.. అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని సంప్రదిస్తున్నామన్నారు.