విశాఖలో పోలీసులతో యువతి హంగామా

Visakhapatnam police who attacked the young woman.త‌న వాహ‌నానికి అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అనుమ‌తి ఉన్నా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 8:57 AM GMT
విశాఖలో పోలీసులతో యువతి హంగామా

త‌న వాహ‌నానికి అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అనుమ‌తి ఉన్నా.. ఎందుకు ఫైన్ వేశారంటూ విశాఖ‌కు చెందిన ఓ మ‌హిళా ఫార్మసీ ఉద్యోగిని పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీశారు. దీనిపై వాగ్వాదం జ‌రిగింది. దీంతో ఆమెను పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించేందుకు య‌త్నించారు. కరోనా సమయంలో విధి నిర్వహణకు వచ్చిన తనపై దౌర్జన్యం చేయడం ఏమిటని నిలదీసింది. దారిన పోతున్నవారు వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది,

విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ప్ర‌తి రోజు ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెలుతుంది. తిరిగి పని ముగించుకుని సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ప్ర‌తి రోజులాగే శనివారం ఆమెను తీసుకెళ్లడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న టూ వీలర్ ఫొటో తీశారు.

వాహ‌నానికి ఫైన్ విధించిన‌ట్లు ఆమె మొబైల్‌కు సందేశం వ‌చ్చింది. దీంతో ఇంటికి వెలుతున్న అప‌ర్ణ వెన‌క్కి వ‌చ్చి పోలీసుల‌ను నిల‌దీశారు. త‌న‌కు అనుమ‌తి ఉన్న‌ప్పుడు త‌న వాహ‌నంపై ఎలా అప‌రాధ రుసుం విధిస్తార‌ని పోలీసుల‌ను అడిగింది. అది వాగ్వాదానికి దారి తీసింది. వాహానాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించారు. విధులకు ఆటంకం కలిగించిందంటూ, ఇద్దరిపై కేసు నమోదు చేయాలని వారి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. దీంతో ఆమె తిర‌గ‌బ‌డ‌డం, మ‌హిళా పోలీసులు నిలువ‌రించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో తోపులాట జ‌రిగింది.

పోలీసులు ఆమెను బ‌ల‌వంతంగా వాహ‌నంలోకి ఎక్కించ‌డానికి వారిని ప్ర‌తిఘ‌టించారు. అంతేకాదు అక్కడే ఉన్న పోలీస్ అధికారి గట్టిగా పట్టుకోండి అంటూ అరవడం వినిపిస్తోంది. అమ్మాయి మద్యం తాగి ఉంటుందని, పరీక్షకు స్టేషన్‌కు తీసుకువెళ్లాలని ఓ పోలీస్‌ అధికారి ఆదేశించారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. 'నన్ను చంపినా పోలీస్‌ స్టేషన్‌కు రానంటూ'.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. చివ‌రకు పోలీసులు వెనుదిగారు.

పోలీసు విధుల‌ను అడ్డ‌గించినందుకు, మ‌హిళా హోంగార్డును గాయ‌ప‌ర‌చినందుకు ల‌క్ష్మీ అప‌ర్ణ‌, ఆమె స్నేహితుడు రాజ్‌కుమార్‌ల‌పై సెక్ష‌న్ 352, 353ల కింద కేసు న‌మోదుచేశామ‌ని విశాఖ తూర్పు ఏసీపీ హ‌ర్షిత్ చంద్ర తెలిపారు. ఆమె వాహ‌నానికి అప‌రాధ రుసుం విధించే స‌మ‌యంలో రాజ్‌కుమార్ ఎలాంటి ప‌త్రాల‌ను చూపించ‌లేద‌ని, బ‌య‌ట తిరిగేందుకు అత‌నికి అనుమ‌తి లేద‌న్నారు. అప‌ర్ణే పోలీసుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి గొడ‌వ‌ప‌డింద‌ని చెప్పారు.

Next Story