విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని ఆలయ అధికారులు నిర్ణయించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను రోజూ వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. 200 నుంచి 300 మంది వరకు వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలతో ఆలయానికి వస్తున్నారు. వారు టికెట్ కొనకుండానే దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వచ్చింది. ఇక ప్రొటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేసుకుంటున్న వాళ్లు మరికొందరు.
దీనివల్ల ఆలయ ఆదాయానికి గండి పడుతుందని ఆలయ అధికారులు భావించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే వీఐపీ, వీవీఐపీ దర్శనం చేసుకునే వారు సైతం టికెట్లు కొనుగోలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.