విజయవాడ ఉగ్రకుట్ర కేసు.. ఆరుగురు నిందితులకు 5 రోజుల పోలీస్ కస్టడీ
విజయవాడ ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది.
By - అంజి |
విజయవాడ ఉగ్రకుట్ర కేసు.. ఆరుగురు నిందితులకు 5 రోజుల పోలీస్ కస్టడీ
విజయవాడ ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (CMM) బెజవాడ రాధారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. షాద్మాన్ దిల్కాష్ (A4), లక్ష్మీ అహ్మద్ (A7), జిషన్ అబ్దుల్ మజీద్ (A9), మీర్ ఆసిఫ్ అలీ (A10), షారుఖ్ ఖాన్ (A12), ఫయాజ్ ఉర్ రెహ్మాన్ (A13)లను ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్13 వరకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. గత వారం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, లోతైన విచారణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఈ కేసులో ఉన్న మిగిలిన 11 మంది నిందితుల జ్యుడీషియల్ రిమాండ్‌ను కోర్టు ఏప్రిల్ 20 వరకు పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను జైలు అధికారులు వర్చువల్ విధానంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇప్పటికే పోలీస్ కస్టడీ ముగిసిన మహ్మద్ రహంతుల్లా షరీఫ్ (A1), మహ్మద్ డానిష్ (A2), మీర్జా సోహైల్ బేగ్ (A3), సైదా బేగం (A5), మరియు అబ్దుల్ సలామ్ (A11)లకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.
ఈ కేసులో ఉన్న ఒక మైనర్ నిందితుడి విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. మైనర్ నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జువైనల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై కోర్టు ఇంకా తీర్పు వెల్లడించలేదు. ఈ ఉగ్రవాద కుట్రకు సంబంధించిన మూలాలను వెలికితీసేందుకు పోలీసులు ఈ కస్టడీ విచారణను అత్యంత కీలకంగా భావిస్తున్నారు.