విజయవాడ కార్పొరేటర్ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన తండ్రి కేశినేని నానికి టీడీపీ జరిగిన అవమానం అందరికీ తెలిసిందేనని, ముగ్గురి స్వార్థం వల్ల తమ కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం అని ఆమె తెలిపారు.
అంతకుముందు ఎంపీ నాని తన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. కాగా.. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. కేశినేని నానిని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఇదంతా మొదలైనట్టు తెలుస్తోంది.