విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు, బాలిక మృతి.. ఇళ్లు ధ్వంసం
విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla
విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో జనజీవనం స్తంభించింది. ప్రజారవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. క్రీస్తురాజపురంలో భారీ వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగిపడి మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిన సమయంలో ఇంట్లో ఉన్న బాలిక బండరాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ సంఘటనలో మరికొందరికి గాయాలు అయ్యాయి. ఈ సంగటన గురించి పోలీసులు సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారికి రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. దెబ్బ తిన్న ఇళ్లలో ఇంకా కొందరు ఉన్నారని స్థానికులు అంటున్నారు. సహాయక చర్యలు అక్కడ ఇంకా కొనసాగుతున్నాయి.
మరోవైపు విజయవాడ బస్టాండ్ దగ్గర బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీలు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోతున్నాయి. రెండు బస్సుల్లో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి చాలా సేపటి వరకు గుంతలో ఇరుక్కున్న బస్సులోనే వేచి చూశారు ప్రయాణికులు. సహాయక చర్యల్లో పాల్గొందామంటే రెస్క్యూ సిబ్బందికి వర్షం అడ్డంకిగా మారింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షం ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలకు ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు.