అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్త జనం తరలి వచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ మేర క్యూ లైన్ పెరిగింది. శ్రీలలితా త్రిపురసుందరీదేవీ అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తుల రాక మొదలైంది. అమ్మవారి దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటోకాల్ ఉన్నవారికి మినహా అంతరాలయ దర్శనాలు కల్పిస్తున్నారు.
వీఐపీల దర్శనాలను ఉదయం, సాయంత్రం నిర్ణయించిన టైంలోనే అనుమతించడం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి. కొందరు భక్తులు లక్షకుంకుమార్చన, తదితర ఆర్జిత సేవా పూజల్లో పాల్గొంటుండగా, మరికొందరు భక్తులు పొంగళ్లను సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనం శీఘ్రంగా అయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని భక్తుల కోసం అందుబాటులో ఉంచారు అధికారు. వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక వాహనంతో పాటు వీల్ ఛైర్ సౌకర్యం అందుబాటులో పెట్టారు. ఎక్కడికక్కడ లగేజ్ కౌంటర్లు, విజయవాడ నగరపాలక సంస్థ వారు త్రాగునీరు ఏర్పాటు చేశారు.