Vijayawada: బస్టాండ్‌లో ప్రమాదం అందుకే జరిగింది.. దర్యాప్తు కమిటీ నివేదిక
జయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 9:45 AM GMTVijayawada: బస్టాండ్‌లో ప్రమాదం అందుకే జరిగింది.. దర్యాప్తు కమిటీ నివేదిక
విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. బస్టాండ్‌లో బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు రవాణాశాఖ అధికారులతో దర్యాప్తు కమిటీని నియమించారు. దీనిపై విచారణ జరిపిన కమిటీ సభ్యులు తాజాగా నివేదికను సమర్పించారు. డ్రైవర్‌కు సరైన శిక్షణ ఇవ్వకుండానే బస్సు అప్పగించినట్లు రవాణా శాఖ అధికారుల దర్యాప్తు కమిటీ తేల్చింది. బస్సులోని ఆటోమెటిక్ గేర్ సిస్టమ్‌పై డ్రైవర్‌కు సరిగ్గా అవగాహన లేదని.. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తు బృందం వెల్లడించింది.
అయితే.. ఈ దర్యాప్తు నివేదికను రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. దర్యాప్తు బృందం నివేదికలోని అంశాలపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. కాగా.. సోమవారం ఉదయం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ అనూహ్య ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన మెట్రోలగ్జరీ ఏసీ బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లి రెప్పపాటులో బీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆటోనగర్ డిపోకు చెందిన బస్సును డ్రైవర్ ప్రకాశం రివర్స్ చేసేందుకు ప్రయత్నించగా ఒక్క ఉదుటున అడుగు ఎత్తు ఉన్న ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మోటాని కుమారి(45), గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన చిన్నారి కాటి ఆయాన్ అలియాస్ చెర్రీ (7 నెలలు), గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రావిపాడుకు చెందిన బుకింగ్ క్లర్క్ వై.వీరయ్య(21) వీరయ్య. బస్సు మీదకు దూసుకు వస్తుండటాన్ని వీరు ఆఖరి క్షణంలో గమనించారు. అక్కడినుంచి తప్పించుకునే లోపే బస్సు మీదకు దూసుకొచ్చింది. దాంతో బస్సు టైర్ల కింద పడి ప్రాణాలు విడిచారు.