ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుంటే మరో వైపు పాల ధరలకు కూడా రెక్కలొస్తున్నాయి. తాజాగా విజయ డెయిరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల ప్యాకెట్ల ధరను పెంచింది. సోమవారం(సెప్టెంబర్ 26) నుంచి పాల ప్యాకెట్ల ధరలను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ ఈశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. విజయ లోఫ్యాట్ రూ.26, ఎకానమీ రూ.28, స్పెషల్ రూ.34, విజయ గోల్డ్ రూ.35గా నిర్ణయించారు. నెలవారీ పాల కార్డు కొనుగోలు చేసిన వారికి అక్టోబరు 9 వరకు పాత ధరలు వర్తిస్తాయన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. పాల ఉత్పత్తిదారులకు చెల్లించే సేకరణ ధర, డీజిల్, రవాణా ఖర్చులు పెరిగినందున ధరలు సవరించినట్లు తెలిపారు.
మరోవైపు.. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయ డెయిరీ పాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.. గేదె, ఆవు పాల ధరలను లీటర్‌కు రూ.4 చొప్పున పెంచగా.. లీటర్ టోల్డ్ మిల్క్ ధర రూ.51 నుంచి రూ.55 వరకు పెరిగింది. అర లీటర్ పాల ధర రూ.26 నుంచి రూ.28కి చేరింది. ఇక డబుల్ టోల్డ్ మిల్క్ అర లీటర్ ధర రూ.24 నుంచి రూ.26కు చేరగా, ఆవు పాలు అర లీటర్ ధర రూ.26 నుంచి రూ.28కి చేరింది.