ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. కూరగాయలే కారణం..!
Vegetables are the Reason Behind Eluru Mystery Disease. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. కూరగాయలే కారణం..
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2021 11:25 AM ISTపశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపిన వింత వ్యాధికి కలుషిత కూరగాయలే కారణంగా నిర్ధారణ అయ్యింది. వివిధ సంస్థల నివేదికలు పరిశీలించిన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది. ఏలూరు మార్కెట్‌కు వచ్చిన కూరగాయలు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లినందున బాధితులు వేర్వేరు చోట్ల కనిపించారని పేర్కొంది. మంచినీరులో కొన్ని కలుషితాలున్నా అవి పరిమితుల్లోనే ఉన్నాయని.. ఈ సమస్యలకు అవి మూలం కాదని నిర్ధారణకు వచ్చింది. కూరగాయల్లో ఉన్న ఆర్గానో క్లోరైడ్స్ వలనే వింత వ్యాధి లక్షణాలు బయటపడినట్లు కమిటీ పేర్కొంది. ఏలూరు కృష్ణా కాల్వ కాలుష్యరహితంగా మార్చడానికి కమిటీ పలు సూచనలు చేసింది.
గత నెల 4 నుంచి 12 వరకు 622మందికి వింత వ్యాధి సోకగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మూర్ఛతో కిందపడిపోవడం, నోటి వెంట నురగ, జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో విజయవాడ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ అంతుచిక్కని వ్యాధి గురించి తెలుసుకునేందుకు జాతీయ, రాష్ట్ర సంస్థలు బాధితుల నివాస ప్రాంతాల్లోని కూరగాయలు, చేపలు, పాలు, పండ్లు భూగర్భ జలాలు, తాగునీటి నమూనాలు సేకరించారు.
ఆర్గానో క్లోరైడ్స్ వల్లే బాధితులు అనారోగ్యానికి గురి అయ్యారని కమిటీ అభిప్రాయపడింది. అయితే.. బాధితుల రక్త నమూనాల్లో ఇది కనిపించలేదు. వ్యాధి లక్షణాలు, రోగులు కోలుకోవడం చూస్తే దీని వల్లే ఇదంతా జరిగిందనిపిస్తోంది. శరీరంలోకి చేరిన 24 గంటల తరువాత పరీక్షిస్తే ఆర్గానో క్లోరైడ్ ప్రభావం కనిపించదు. అందుకే బాధితుల రక్త నమూనాల్లో ఇది కనిపించలేదు. కానీ వ్యాధి లక్షణాలు అన్నీ దీనికి చాలా దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా ఇది పాలు, నీరు, కూరగాయలు, పండ్ల ద్వారా శరీరంలోకి వెళ్లిఉండవచ్చునని.. వీటిలో కూరగాయలే ప్రధాన కారణం కావొచ్చునని నిపుణులు భావిస్తున్నారు.