గోదావరి వరదలకు ఓ ఆలయం కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఆలయం నీటి ప్రవాహాంలో కొట్టుకుపోతున్న ఫోటోలు, వీడియోలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం పురుషోత్త పట్నంలో గోదావరి నది ఒడ్డున వనదుర్గ ఆలయాన్ని 15 ఏళ్ల క్రిందట స్థానికులు నిర్మించారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. అమ్మవారికి మొక్కుకుంటే కోరికలు నేరవేరుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. శ్రావణ శుక్రవారం కావడంతో నిన్న పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది. వరద తాకిడికి తీరం కోతకు గురికావడంతో మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపునకు ఒరిగిపోయింది. భయాందోళనకు గురైన భక్తులు అందరూ భయటకు వచ్చారు. సాయంత్రానికి ఆలయం మరింత నీటిలోకి ఒరిగింది. మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.