సీఎంగా రెండేళ్లు..

Two years completed as a ap cm.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 2:51 AM GMT
సీఎంగా రెండేళ్లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసి నేటికి స‌రిగ్గా రెండేళ్లు. మా పార్టీ మేనిఫెస్టోనే మాకు భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబిల్‌. మేనిఫెస్టోలో ఏమి చెప్పామో.. వాటిని త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాం. కులం, మ‌తం, ప్రాంతం, రాజ‌కీయం వంటి వాటిని చూడ‌కుండా అర్హులందరినీ ఆదుకోవ‌డమే మా ల‌క్ష్యం అంటూ ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా జ‌గ‌న్ చెప్పిన మాట‌లివి. అన్న‌ట్లుగా ఈ రెండేళ్లో ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు జ‌గ‌న్‌. పూర్తిగా ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా.. నవరత్నాల అమలుపైనే ఫోకస్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 129 వాగ్దానాలకు గానూ.. దాదాపు 107 హామీలను అమలు చేసింది జగన్ సర్కార్. మిగిలిన వాటిలో.. పోలవరం, నాడు-నేడు లాంటివి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం రెండేళ్లలోనే.. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో దాదాపు 95 శాతం అమలు నెరవేర్చారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌థ‌కాల అమ‌లు ఆగ‌లేదు. ఈ రెండేళ్లలో నవరత్నాల ద్వారా 6.5 కోట్ల మందికి (కొందరికి ఒకటి కంటే ఎక్కువ పథకాల వల్ల లబ్ధి) వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.95,528.50 కోట్లు నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 2.36 కోట్ల మందికి రూ.36,197.05 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు.

రైతు భరోసాతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు వారికి అందుబాటులో ఉండేలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. ఇక.. విద్యారంగంలోనూ అనేక మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు, సదుపాయాలు మెరుగుపరిచేందుకు.. నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు.

Next Story