కాకినాడ జిల్లాలో కలకలం.. మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు.. చీకట్లోనే జీవనం

Two women rescued from self-confinement in Kakinada. గడిచిన మూడేళ్ల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న

By అంజి  Published on  21 Dec 2022 11:05 AM IST
కాకినాడ జిల్లాలో కలకలం.. మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు.. చీకట్లోనే జీవనం

అది 2019.. లాక్‌డౌన్‌ సమయం. అందరూ ప్రభుత్వ సూచనల మేరకు ఇళ్లకే పరిమితమయ్యారు. అందరీలానే ఆ కుటుంబం కూడా ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. అందరూ ఇళ్ల నుంచి బయటకు రావడం మొదలు పెట్టారు. కానీ ఆ కుటుంబంలోని తల్లీకూతుళ్లు మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేదు. గడిచిన మూడేళ్ల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆ తల్లీకూతుళ్ల ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని కుయ్యేరులో జరిగింది.

ఈ క్రమంలోనే తాజాగా తల్లి తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది.. పోలీసులు, స్థానికుల సహకారంతో తల్లీకూతుళ్లను బలవంతంగా కాకినాడ గవర్నమెంట్‌ ఆస్పత్రికి తరలించారు. కుయ్యేరు గ్రామంలో నివాసం ఉంటున్న కర్నిడి సూరిబాబు ఊరురా తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కోవిడ్‌ టైంలో అందరితోపాటే ఇంటికి పరిమితమైన అతని భార్య మణి, కూతురు దుర్గా భవాని మానసిక అనారోగ్యంతో ఇన్నేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా తలుపులు మూసేసుకుని ఉన్ఆనరు.

చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి ఎంత పిలిచినా.. బయటకు రాలేదు. పైగా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఈ క్రమంలోనే వారిని బంధువులు, స్థానికులు పలకరించడం మానేశారు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ.. వారికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తుండే వాడు. అయితే కొన్ని రోజుల నుంచి భార్య మణి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో సూరిబాబు తన భార్య మణికి చికిత్స అందించాలని దుగ్గుదుర్రు పీహెచ్‌సీలో సిబ్బందిని కోరాడు.

నిన్న ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి పిలిస్తే తలుపులు తియలేదు. ఈ క్రమంలోనే గ్రామ సర్పంచ్‌ పిల్లి కృష్ణమూర్తి, స్థానికుల సహకారంతో తలుపులను విరగ్గొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తల్లీ కూతుళ్లు వైద్యానికి నిరాకరించడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. దీంతో సర్పంచ్‌ కృష్ణమూర్తి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ఆ ఇంటికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story