టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. మల్లపల్లి పారిశ్రామికవాడలో 128 మంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా మోసం చేశాడని ఫిర్యాదులు అందటంతో.. అతనిపై భూకబ్జా, రైతులను మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసినందుకు వంశీతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. దీంతో వైసీపీ నేత వంశీకి ఉహించని విధంగా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదవుతుండటం ఆయనను, వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లోకి లాగుతుంది. ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని.. ఇది మంచి పద్దతి కాదని ఆరోపిస్తున్నారు.
కాగా కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ కేసులో ఆయన అరెస్ట్ కాగా.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు అతనిపై కొత్త కేసులు నమోదు చేస్తున్నారు. నిన్నటితో అతని రిమాండ్ ముగియగా.. పోలీసులు అభ్యర్థన మేరకు మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. వంశీ తో పాటు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఉన్న నలుగురు నిందితులకు కూడా న్యాయమూర్తి రిమాండ్ పొడిగించారు. దీంతో వంశీకి మరోసారి వైద్య పరీక్షలు చేసిన పోలీసులు అతన్ని మళ్లీ రిమాండ్ కు తరలించారు.