దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు.. చంద్రబాబు ఆగ్రహాం
Two Cases filed over Devineni Uma.కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రానెట్ అక్రమ మైనింగ్
By తోట వంశీ కుమార్ Published on 28 July 2021 6:18 AM GMTకృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రానెట్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్థారణకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్థరాత్రి ఉమను పోలీసులు అదుపులోకి తీసుకుని పెదపారపూడి పోలీస్ స్టేషన్‌కుతరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ శ్రేణుల ఆందోళన..
దేవినేని అరెస్టుకు నిరసనగా కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన నేత అరెస్టు దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమను తమకు చూపించాలని నినాదాలు చేశారు. దీంతో నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
చంద్రబాబు ఆగ్రహాం..
దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమపై దాడికి పాల్పడిన నేతలనే వదిలిపెట్టాలని మండిపడ్డారు. టీడీపీ నేతలపై హత్యయత్నం కేసు పెడతారా అని ప్రశ్నించారు. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ అరెస్టు, తదితర విషయాలపై ఇందులో చర్చించనున్నారు.
నిన్న ఏం జరిగిందంటే..?
కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా మంగళవారం పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. దేవినేని కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ.. తన ఫిర్యాదును తీసుకోవాలంటూ దేవినేని ఉమా జీ.కొండూరు పోలీస్‌స్టేషన్ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటుూ కారులోనే కూర్చున్నారు. సుమారు ఆరు గంటల పాటు కారులోనే కూర్చొన్నారు. అయితే.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.