ఏపీ పోలీసులకు ట్విటర్ షాక్.. సమాచారమివ్వలేం
Twitter Shock to AP police.కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను అమలు చేయకపోవడంతో
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2021 12:52 PM ISTకేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను అమలు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ట్విటర్ కు ఇప్పటి వరకు ఐటీ చట్టం కింద ఇస్తున్న మినహాయింపులను తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ట్విటర్‌లోని అన్ని అంశాలకు సంస్థ బాధ్యత వహిండమే కాక.. చట్ట పరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నూతన ఐటీ చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏదైన సమాచారం అడిగితే ఇవ్వాలి. అయితే.. ట్విటర్ ఇందుకు నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వివిధ కేసులకు సంబంధించి పోలీసులు ట్విటర్‌కు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికి ట్విటర్ తన మొండిపట్టును వీడడం లేదు. తాజాగా ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్ బేఖాతరు చేసింది. ఇప్పటికి మూడుసార్లు అధికారికంగా మెయిల్ పంపినప్పటికీ స్పందించడంలేదు. ఖాతాదారుల సమాచారాన్ని అందించలేమని నిరాకరించింది. అంతే కాదు తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రత ముఖ్యంటోంది ట్విట్టర్.
గుర్తుతెలియని వ్యక్తులు.. డీజీపీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో మూడు వారాల కిందట ట్విటర్‌లో నకిలీ ఖాతాను తెరిచారు. గౌతం సవాంగ్ ఫొటో కూడా పెట్టారు. ఈ విషయాన్ని ట్విటర్ దృష్టికి పోలీసులు తీసుకెళ్లడంతో.. ఆ ఖాతాను తొలగించింది. ఈ వ్యవహరంపై విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఏ ఐపీ అడ్రస్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు. దర్యాప్తు ముందుకు సాగాలంటే ఐపీ అడ్రస్ తప్పనిసరి. వీటి కోసం పోలీసులు ట్విటర్‌ను మొయిల్ ద్వారా సంప్రదించారు. అయితే..సమాచారం ఇవ్వడం కుదరదని, ఖాతాదారుల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని ట్విటర్ సమాధానం ఇచ్చింది. దీనిపై పోలీసులు మరో మెయిల్ ను పంపినా స్పందన లేదు. దర్యాప్తులో భాగంగా లాగ్స్ కీలకమని, ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకు వెలుతామని మూడో సారి హెచ్చరించినా సమాధానం రాలేదు. దీంతో.. విజయవాడ పోలీసులు కూడా సమాచారాన్నిరాబట్టుకునేందుకు ట్విటర్ అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.