ర్యాగింగ్ క‌ల‌క‌లం.. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు.. 12 మంది విద్యార్థులు

Twelve Students Suspended for ragging in JNTU Anantapur.అనంత‌పురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 9:49 AM GMT
ర్యాగింగ్ క‌ల‌క‌లం.. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు.. 12 మంది విద్యార్థులు

అనంత‌పురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో ర్యాగింగ్ క‌ల‌క‌లం రేగింది. సీనియ‌ర్ విద్యార్థుల వేదింపులు మితిమీరుతుండ‌డంతో జూనియ‌ర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాంగింగ్ కు పాల్ప‌డిన 12 మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా.. జేఎన్‌టీయూ(ఏ) చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులు సస్పెన్షన్ కావ‌డం ఇదే తొలిసారి.

అనంత‌పురం జేఎన్‌టీయూలో జూనియ‌ర్‌, సీనియ‌ర్ విద్యార్థుల హ‌స్ట‌ల్స్‌కు వేర్వేరుగా ఉన్నాయి. అయినా.. సీనియ‌ర్ విద్యార్థులు జూనియ‌ర్ల‌ను పిలిచి.. ర్యాగింగ్ పేరిట వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్నారు. జూనియ‌ర్ విద్యార్థుల చేత అర్థ‌న‌గ్నంగా డ్యాన్సులు చేయిస్తూ.. వారు అల‌సిపోయేదాకా చేయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని పురమాయిస్తున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి త‌మ‌ని నిల్చోబెడుతున్నార‌ని.. తాము ఏదైనా అంటే.. సీనియ‌ర్లు చెప్పిన‌ట్లు చేయాల‌ని బెదిరిస్తున్న‌ట్లు బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీనిపై క‌ళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడారు. ర్యాగింగ్ జ‌రిగిన‌ట్లు తెలియ‌గానే శుక్ర‌వారం రాత్రి హ‌స్ట‌ల్‌కు వెళ్లి ఆరా తీసిన‌ట్లు తెలిపారు. అర్థ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ఉండి విద్యార్థులతో మాట్లాడామ‌ని.. ఎవ‌రైనా ర్యాగింగ్‌కు పాల్ప‌డితే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు చెప్పారు. ఇక ర్యాగింగ్‌కు పాల్ప‌డిన 12 మంది కెమిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్ విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story