తిరుమల లడ్డూ కల్తీచేస్తే.. వారు రక్తం కక్కుకుని చావాలి: టీటీడీ మాజీ చైర్మన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 9:30 PM ISTతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారనీ.. జంతువుల కొవ్వు కలిపారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఇదే అంశంపై టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు.
సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాద విషయంలో స్వామి వారికి కలంకితం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిజ. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. స్వప్రయోజనాల కోసం జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒకటని అన్నారు. సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకోవడం సరికాదని అన్నారు. భగవంతుడు కు ప్రీతి పాత్రమైన లడ్డుపై చంద్రబాబు అపచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరు అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలకంటే ఘోరమని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని కూడా జోక్యం చేసుకుని నిజాలు నిగ్గు తేల్చాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు.
ఒక వేళ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే.. ఆ దోషులు ఎవరైనా రక్తం కక్కుకుని చావాలని వెంకటేశ్వర స్వామి వారినే కోరుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు నాశనం చేస్తున్నారని చెప్పారు. శకుని బతికి ఉంటే చంద్రాబుని చూసి భయపడి పారిపోయేవాడంటూ ఎద్దేవా చేశారు. కలుషితం అయ్యింది చంద్రబాబే అన్నారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించారు.. తప్పు చేసింది ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.