తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్ తనూజ, దివ్వెల మాధురిలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనూజ పుట్టినరోజు వేడుకలను తిరుమల కొండపై నిర్వహించడంపై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వేడుకల కోసం తిరుపతి నుంచి కేక్‌ను కొండపైకి తెప్పించారని, ఆ తర్వాత వేడుకలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని సమాచారం.
ఈ ఘటనపై శుక్రవారం టీటీడీ పీఆర్వో విభాగం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి చర్యలు అత్యంత అనుచితమని, ఇది ఆలయ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వేడుకలు జరపడం నిషిద్ధమని టీటీడీ పేర్కొంది. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసిందని, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం మాధురి, తనూజలతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. గతంలో కూడా ఈ ఎమ్మెల్సీ జంట తిరుమల ఆలయం ముందు ఫోటో షూట్ నిర్వహించి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది.