తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో ధర్మారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి(28) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నాం గుండెపోటుకు గురైన చంద్రమౌళిని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు(బుధవారం) తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకి ఆయన భౌతిక కాయాన్ని తరలించనున్నారు.
వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా..
ఇటీవలే చంద్రమౌళికి చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. జనవరిలో వీరి వివాహాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైలోని అల్వారుపేటలో ఉన్న బంధువులకు వివాహా ఆహ్వాన పత్రికలను అందజేసేందుకు కారులో చంద్రమౌళి వెలుతుండగా గుండెలో నొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పాడు. వెంటనే వారు సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.