తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే వస్తోంది. తాజాగా కూడా అలాంటి హెచ్చరికలను జారీ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల వంటి అత్యంత డిమాండ్ ఉన్న టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. తమను తాము టీటీడీ కార్యాలయాల్లో పనిచేసే అధికారులుగా, మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధుల పేషీ సిబ్బందిగా పరిచయం చేసుకుంటున్నారని చైర్మన్ వివరించారు. ఇలా భక్తులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తమ దృష్టికి అనేకం వచ్చాయనారు. భక్తులు ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. దర్శన టికెట్లు, వసతి గదుల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.