టీటీడీ హనుమంతుడి జన్మస్థానంపై అధికారిక ప్రకటన చేసింది. తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశోధన చేసి.. హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలను సేకరించారు.
హనుమ జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నాం. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు అని మురళీధర శర్మ వెల్లడించారు.