గోదావరి ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్ల వేగం పెంపు.. గంటకు ఎంత స్పీడంటే?

Train speed on Godavari Arch Bridge increased to 50 kmph. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు

By అంజి  Published on  28 July 2022 4:08 PM IST
గోదావరి ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్ల వేగం పెంపు.. గంటకు ఎంత స్పీడంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలో వేగ పరిమితిని పెంచడం ఇది రెండోసారి. 2.9 కి. మీ పొడవున్న ఈ వంతెన దక్షిణ మధ్య రైల్వే కింద ఉన్న చెన్నై-హౌరా గోల్డెన్ డైగోనల్ మార్గంలోకి వస్తుంది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఈ వంతెన వారధిగా ఉంది. ఈ బ్రిడ్జిపై 2015 నుంచి రైళ్ల గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉండేది.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాకేష్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పబడుతున్న ఆర్చ్ వంతెనపై 2015 నుండి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లకు గరిష్టంగా 30 కేఏంపీహెచ్‌ వేగాన్ని మాత్రమే అనుమతించామని చెప్పారు. ఏప్రిల్‌లో గంటకు 40 కిలోమీటర్లకు పెంచి అమలు చేస్తున్నామని చెప్పారు. తాజాగా మరోసారి గంటకు 40 నుంచి 50 కి.మీలకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈ బ్రిడ్జ్‌పై వేగాన్ని పెంచేందుకు గాను అధికారులు ఇటీవల పట్టాల కింద ఉండే స్లీపర్లను మార్చి, ట్రాక్‌ను పటిష్టం చేశారు. ఎస్‌సీఆర్‌ జనరల్ మేనేజర్ (ఇంచార్జ్) అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. 50 కి.మీల వేగంతో రైలు ప్రయాణించేందుకు వీలుగా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వంతెనపై రైలు వేగాన్ని పెంచడం వల్ల రైల్వే కార్యకలాపాలలో రద్దీని తగ్గించవచ్చన్నారు. ఇది రైళ్ల సమయపాలనను, ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందన్నారు.

Next Story