ఏపీలో తీవ్ర విషాదం.. బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఊహించని రీతిలో జరిగిన ఒక దారుణమైన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకుంది.

By -  అంజి
Published on : 15 March 2026 10:57 AM IST

Punganur Tragedy, Bike Smoke Suffocation, Annamayya District News, Carbon Monoxide Poisoning Death, Punganur Family Dead, Mechanical Negligence, Bike Engine Repair Accident

ఏపీలో తీవ్ర విషాదం.. బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఊహించని రీతిలో జరిగిన ఒక దారుణమైన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకుంది. కేవలం ఒక చిన్న పొరపాటు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నివసించే మురళి కుటుంబంలో శనివారం రాత్రి తీరని శోకం మిగిలింది. మురళి తన ద్విచక్ర వాహనం ఇంజిన్ పాడవ్వడంతో మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు.

బైక్ ఇంజిన్ సెట్ అవ్వాలంటే (బోర్ చేయించిన తర్వాత) రాత్రంతా స్టార్టింగ్‌లోనే ఉంచాలని మెకానిక్ సూచించాడు. దీంతో మురళి తన బైక్‌ను ఇంటి లోపల ఉంచి, ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచాడు. రాత్రి సమయంలో మురళి తండ్రి రామచంద్రయ్య, కొడుకు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన కింది గదిలో నిద్రపోయారు. మురళి, రేవతి దంపతులు మాత్రం ఇంటి పైన ఉన్న గదిలో పడుకున్నారు. అయితే, ఆ ఇల్లు చాలా ఇరుకుగా ఉండటం, కిటికీలు లేకపోవడంతో బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన పొగ గది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా వ్యాపించింది.

గాఢ నిద్రలో ఉన్న రామచంద్రయ్య, ఆయన మనవడు, మనవరాళ్లు ఆ విషపూరితమైన పొగను పీల్చడంతో ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఉదయం మురళి దంపతులు కిందకు వచ్చి చూసేసరికి నలుగురూ అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశులయ్యారు. గది పైన పడుకోవడం వల్ల మురళి దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు కానీ, కళ్లముందే తండ్రి, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో పుంగనూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story