కొత్త బట్టలొచ్చాయి కానీ.. ముస్తాబు చేసే అమ్మే కన్పించకుండా పోయింది!

ఈస్టర్ పండుగ వేళ చిత్తూరు జిల్లాలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. పిల్లల కోసం కొత్త బట్టలు కొని, వారిని ముస్తాబు చేయాలనుకున్న ఒక తల్లి కలలు కల్లలయ్యాయి.

By -  అంజి
Published on : 6 April 2026 8:37 AM IST

Chittoor Road Accident, GD Nellore Mandal, Easter Tragedy, Mother Death Accident, Road Safety, Mukkallathuru SC Colony, Unidentified Vehicle Hit, Tragic Death, Family Loss

కొత్త బట్టలొచ్చాయి కానీ.. ముస్తాబు చేసే అమ్మే కన్పించకుండా పోయింది!

ఈస్టర్ పండుగ వేళ చిత్తూరు జిల్లాలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. పిల్లల కోసం కొత్త బట్టలు కొని, వారిని ముస్తాబు చేయాలనుకున్న ఒక తల్లి కలలు కల్లలయ్యాయి. పది నిమిషాల్లో క్షేమంగా ఇల్లు చేరుతారనుకున్న సమయంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను కబళించింది.

జీడీనెల్లూరు మండలం ముక్కళత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన రంజిత్, రోజా (26) దంపతులు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో, తమకు కాకపోయినా పిల్లలకైనా పండుగ సంతోషాన్ని ఇవ్వాలని శనివారం రాత్రి చిత్తూరు వెళ్లారు. అక్కడ పిల్లల కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు.

మృత్యువు ఒడిలోకి..

మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుకుంటారనగా, గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రోజాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చిత్తూరు ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. భర్త రంజిత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

కంటతడి పెట్టించిన దృశ్యం:

ఆదివారం రోజా మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తల్లిని విగతజీవిగా చూస్తూ, అసలేం జరిగిందో తెలియక ఆ చిన్నారులు బిక్కముఖం వేసి చూడటం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. రోజా బ్యాగులో పిల్లల కోసం కొన్న కొత్త దుస్తులు అలాగే ఉండిపోయాయి. "పిల్లలను కళ్లల్లో పెట్టి చూసుకునేదానివి.. ఇప్పుడు వారిని అనాథలను చేసి వెళ్లిపోయావా" అంటూ బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పండుగ పూట ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story