రూ.5.80కోట్ల విలువ చేసే 11.600 కేజీల బంగారంతో వ్య‌క్తి అదృశ్యం

Trader escaped 11kg gold in Mangalagiri.ఓ వ్య‌క్తి రూ.5.80కోట్ల విలువ చేసే 11.600 కేజీల బంగారంతో ఉడాయించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 3:51 AM GMT
రూ.5.80కోట్ల విలువ చేసే 11.600 కేజీల బంగారంతో వ్య‌క్తి అదృశ్యం

ఓ వ్య‌క్తి రూ.5.80కోట్ల విలువ చేసే 11.600 కేజీల బంగారంతో ఉడాయించాడు. మోస‌పోయిన ప‌లువురు వ్యాపారులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా.. త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేదంటూ నిందితుడి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పాత‌మంగ‌ళ‌గిరి ఎన్‌సీసీ రోడ్డులో దిలీప్‌కుమార్ నివాసం ఉంటున్నాడు. దిలీప్‌కుమార్‌ గత కొన్నేళ్లుగా బంగారు వ్యాపారుల వద్ద బంగారం తీసుకుని వస్తువులు చేసి ఇవ్వడం, చేసిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి నగదు తెచ్చి ఇస్తూ నమ్మకంగా వ్యవహరించేవాడు.

చాన్నాళ్లుగా ఈ ప‌ని చేస్తున్నాడు. దీంతో ఇత‌డికి ఎంతో మందికి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆదివారం రాత్రి వ‌ర‌కు న‌గ‌రంలోని 10 మంది బంగారు వ‌ర్త‌కుల నుంచి 11.600కేజీల బంగారు ఆభ‌ర‌ణాలు తీసుకున్నాడు. సోమ‌వారం ఉద‌యం బైక్ పై విజ‌య‌వాడ వెలుతూ.. కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డానికి ఆప‌గా.. త‌న బండిలో ఉంచిన బంగారం సంచిని ఎవ‌రో దొంగిలించుకుని పోయిన‌ట్లు ఓ లేఖ రాసి.. దాన్ని ఇంట్లో ఓ పుస్త‌కంలో ఉంచాడు. ఈ విష‌యాన్ని అత‌డి భ‌ర్య జ్యోతి వ్యాపారుల‌కు తెలుప‌గా.. వారు ఆ లేఖ‌తో పాటు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఆ లేఖ‌లో వ్యాపారుల పేర్లు, వారు ఎంత బ‌రువు క‌లిగిన బంగారు ఆభ‌ర‌ణాలు ఇచ్చింది వివ‌రంగా రాసి ఉంది. ఓ వ్యాపారి నుంచి 5 కేజీల బంగారం తీసుకున్న‌ట్లు ఉంది. సదరు వ్యాపారులకు బంగారం తిరిగి ఇచ్చే స్థోమత తనకు లేదని, బంగారం పోయిన విషయంలో బాధ్యతంతా తనదేనని.. తన తల్లిదండ్రులకు, భార్యకు ఎలాంటి సంబంధం లేదని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడి భార్య జ్యోతి త‌న భ‌ర్త అదృశ్య‌మైన‌ట్లు మ‌ధ్యాహ్నాం ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story