దేశంలో టమాటా ధరలు ఆకాశనంటుతున్నాయి. టమాటాలను సామాన్యుడి కొనలేని పరిస్థితి నెలకొంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రోజుకో విచిత్ర ఘటన వెలుగు చూస్తోంది. ఒకరేమో టమాటాలకు బౌన్సర్లను పెట్టుకుంటే, మరికొంత మంది వాటిని దొంగతనం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టమాటాలపై మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. ఎవరైనా టమాటాలను కొనుక్కుంటూ కనిపిస్తే.. ఎంతైనా మీరు రీచ్ బ్రో అంటూ జోక్‌లు వేసుకుంటున్నారు. తాజాగా టమాటాలకు సంబంధించిన ఓ విచిత్ర సంఘటన ఏపీలో జరిగింది. అనకాపల్లి జిల్లా నూకాలమ్మ ఆలయంలో ఓ భక్తుడు టమాటాలతో తులాభారం ఇచ్చాడు. సాధారణంగా ఎవరైనా బెల్లం, పంచదార, నాణేలతో తులాభారం వేస్తుంటారు.
అందుకు భిన్నంగా కిలో టమామా ధర 120 రూపాయలు పలుకుతున్న వేళ.. టమాటాల తులాభారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఆదివారం నాడు పట్టణానికి చెందిన మళ్లజగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం నూకాలమ్మ ఆలయంలో జరిగింది. 51 కిలోల టమాటాలతో తులాభారం నిర్వహించారు. ఆ తర్వాత బెల్లం, పంచదారలతో తులాభారం ఇచ్చి తమ మొక్కును తీర్చుకున్నారు. వీటన్నింటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. మార్కెట్‌లో టమాటా ధర మోత మోగిపోతున్న వేళ.. ఆలయంలో టమాటా తులాభారం నిర్వహించడాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.