భారీగా తగ్గిన టమాటా ధర.. కిలో ఎంతంటే?
Tomato prices fall heavily. నెల కిందట వంద రూపాయలకు పైగా పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా
By అంజి Published on 31 July 2022 5:50 PM ISTనెల కిందట వంద రూపాయలకు పైగా పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశం నుంచి నేలరాలాయి. మార్కెట్‌లో కిలో టమాటాకు రూ.5 రావడం లేదని.. ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నలు వాపోతున్నారు. గడిచిన 20 రోజుల నుంచి టమాటా ధర భారీగా తగ్గింది. పంట దిగుబడికి వచ్చి మార్కెట్లకు చేరడమే ఇందుకు కారణని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. అయితే టమాటా ధర భారీగా తగ్గడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన చెందుతున్నారు.
ఇక ఏపీలోని మదనపల్లె కూరగాయల మార్కెట్‌లో కిలో టమెటా ధర భారీగా తగ్గింది. కిలో రూ.5లు పలుకుతుండటంతో కనీసం కూలీలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులైతే గిట్టుబాటు ధర లేక కోతకు వచ్చిన టమాటాలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి టమాటాలు దేశవ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు టమాటాల కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో టమాటాకు భారీగా డిమాండ్ తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో కూడా టమాటా పంట దిగుబడికి రావడంతో ఏపీలోని మదనపల్లె నుంచి ఎగుమతి తగ్గింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి దేశంలోని చాలా రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో టమాటా పంట సాగు చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. టమాటా దిగుబడి భారీగా పెరిగి ధరలపై ప్రభావం పడుతోంది. తాజాగా మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా మొదటి రకం రూ.8.40–10 పలకగా, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది.