వండే కూర ఏదైనప్పటికి అందులో టమాట వేయాల్సిందే. టమాటను వేస్తే ఆ కూర రుచే వేరు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే. అందుకనే ప్రతి ఇంటి వంటగదిలో అది కనిపిస్తుంటుంది. అయితే.. టమాట పేరు చెబితేనే భయపడాల్సి వస్తోంది. దాని ధర చూస్తే నోట మాట రాని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి దెబ్బతినడంతో టమాట ధర కొండెక్కుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.30కంటే తక్కువ దొరికిన టమాట ధర నేడు సెంచరీ దాటింది. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో మంగళవారం కిలో టమాట రూ.100కు అమ్మారు.
వాతావరణం మార్పులు, విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా టమాట పంట దిగుబడి దెబ్బతింది. మార్కెట్‌కు వస్తున్న పంటలో డ్యామేజీ అధికంగా ఉండడంతో టమాకు డిమాండ్ ఏర్పడింది. 28 కిలోల ఉండే కేట్ ధర గరిష్టంగా రూ.2800 పలికింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.100పైనే అమ్మే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లోనూ కిలో టమాలను రూ.100కు అమ్మారు. మొన్న ఇక్కడ రూ.50 నుంచి రూ.60 కి విక్రయించగా.. రెండు రోజుల్లోనే ధర రూ.100 చేరడం గమనార్హం.