నేడే కోదండరాముడి కల్యాణం
Today Ontimitta Kodanda Ramudu Kalyanam.ప్రముఖ పుణ్యక్షేత్రం వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముడి వార్షిక
By తోట వంశీ కుమార్ Published on 15 April 2022 8:31 AM ISTప్రముఖ పుణ్యక్షేత్రం వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి(శుక్రవారం) రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో లక్షలాది భక్తజన సమక్షంలో స్వామి వారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం తరుపున సీఎం జగన్.. సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండుళ్లుగా స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది. అయితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున కల్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మంది వీక్షించేలా సౌకర్యాలు కల్పించింది. కల్యాణ ఏర్పాట్లను గురువారం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పరిశీలించారు. వసతుల కల్పన, అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీపై కలెక్టరు విజయరామరాజు, ఎస్పీ అన్భురాజన్, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్ వర్మ, ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కోదండరాముడు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.