తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం కవర్

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2024 1:15 PM GMT
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం కవర్

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి అవశేషాలు కలిపినట్లు రిపోర్టులో తేలింది. ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ​తీసుకుంది. లాంటి పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గొడవ నడుస్తున్న క్రమంలోనే మరోసంచలన విషయం వెలుగు చూసింది. ఖమ్మంలో ఓ భక్తుడికి చేదు అనుభవం ఎదురైంది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం రావడంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు తెలిసిన తర్వాత మళ్లీ ఇలాంటి జరగడం అపవిత్రమేనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్​షిప్​లో ఓ కుటుంబం నివసిస్తోంది. పద్మావతి అనే మహిళ వారి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు బంధువులకు, ఇరుగుపొరుగు వారికి పంచడం కోసమని శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. మరుసటి రోజు లడ్డూని పంచేందుకు చూడగా అందులో పేపర్లు మలిచిపెట్టిన పొగ ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావడం చాలా బాధగా ఉందని భక్తురాలు ఆవేదన వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైందని భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.


Next Story