లడ్డు విక్రయాలపై లేని కల్తీ వివాదం.. భక్తులు ఎన్ని కొన్నారంటే..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని నివేదిక తేల్చింది.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2024 2:48 PM IST
లడ్డు విక్రయాలపై లేని కల్తీ వివాదం.. భక్తులు ఎన్ని కొన్నారంటే..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని నివేదిక తేల్చింది. ఆ తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరుని ప్రసాదంలో కల్తీ చేస్తారా అంటూ మండిపడ్డారు. రాజకీయంగానూ ఈ అంశం దుమారం రేపింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కానీ.. ఈ వివాదం ఏమాత్రం తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదు. మునుపటిలాగానే శ్రీవారి లడ్డూను భక్తులు కొనుగోలు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.

శ్రీవారి ప్రసాదం లడ్డూల విక్రయంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించామని వెల్లడించారు. తిరుమల కొండపై శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూలపై వచ్చిన వివాదాన్ని గతం గతః అని భావించారని అందుకే పెద్ద ఎత్తున లడ్డూ కొనుగోలు చేశారని అన్నారు. ఎప్పటిలానే ప్రసాదాలను తీసుకున్నారని చెప్పారు. అధికారుల వివరాల ప్రకారం... ఈ నెల 19న 3.59 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత 20న 3.17 లక్షల లడ్డూలు, సెప్టెంబర్ 21న 3.67 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చెప్పారు. ఆ తర్వాత రోజు 22వ తేదీన 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివరించారు. అంటే సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని టీటీడీ అధికారులు చెప్పారు.

Next Story