Nandyala: గ్రామంలో పెద్ద పులి పిల్లలు.. భయాందోళనలో ప్రజలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఉదయం పులి పిల్లలు కనిపించడంతో.. స్థానికంగా భయాందోళన నెలకొంది

By అంజి  Published on  6 March 2023 1:45 PM IST
Tiger cubs, Nandyala district

గ్రామంలో పెద్ద పులి పిల్లలు.. భయాందోళనలో ప్రజలు (ఫైల్‌ ఫొటో)

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌ కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఉదయం పులి పిల్లలు కనిపించడంతో.. స్థానికంగా భయాందోళన నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం ప్రకృతి పిలుపులకు హాజరయ్యేందుకు రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడు ఈ పులి పిల్లలను గమనించాడు. అక్కడ నాలుగు పిల్లలను గమనించిన ఆ యువకుడు పులి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయి గ్రామస్థులకు సమాచారం అందించాడు. అయితే పులి పిల్లలపై కుక్కలు దాడి చేస్తాయని వాటిని తీసుకొచ్చి ఓ గదిలో ఉంచిన గ్రామస్తులు.. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ఈ పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా వస్తున్నారు. కొందరు ఆ పిల్లలతో సెల్ఫీలు దిగారు. కాగా నల్లమల గ్రామ శివారు ప్రాంతాలకు అడవుల నుంచి పులులు వస్తుండటం పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నాలుగు పులి పిల్లలు కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖా అధికారులు పులి పిల్లలను స్వాధీనం చేసుకొని సమీపంలోని పులుల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారని సమాచారం.

Next Story