దైవదర్శనానికి వెళ్తూ గోదావరిలో పడి ముగ్గురు మహిళల మృతి
కోనసీమ జిల్లాలో వాపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla
దైవదర్శనానికి వెళ్తూ గోదావరిలో పడి ముగ్గురు మహిళల మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆలమూరు మండలం చిలకలపాడు నుండి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గోదావరి నదిలో పెద్దగా ప్రవాహం లేదు. దాంతో.. కాలినడకన గోదావరిలో వాడపల్లి గుడికి వెళ్తుంటారు భక్తులు. ఇలా చేయడం ఈ ప్రాంత ప్రజలకు అలవాటుగానే వస్తోంది. అయితే.. అక్కడక్కడ మాత్రం మొక్కాళ్ల లోతు నీరు మాత్రం ప్రవహిస్తూ ఉంటుంది. ఆలమూరు మండలం బడుగువానిలంక ఇవతలి ఒడ్డు అయితే.. అవతలి ఒడ్డు వాడపల్లి ఆలయం ఉంటుంది. ఈ క్రమంలోనే చిలకలపాడుకి చెందిన ముగ్గురు మహిళలు ఆలయానికి బయల్దేరారు. శనివారం వేకువజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు మహిళలు కలిసి వెళ్తుండగా గోదావరి మధ్యలో ఊబి ఉంది. ప్రమాదవశాత్తు దాంట్లో చిక్కుకుని ఒకరి తర్వాత ఒకరు ఊబిలో పడిపోయారు. దాంతో.. ముగ్గురూ ఒకే ఊబిలో పడి చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. ఆలయానికి అని వెళ్లిన వారు తిరిగి సాయంత్రం అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. గోదావరి మార్గంలో వెతకగా ఊబిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురు మృతులు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామస్తులుగా పోలీసులు తెలిపారు. అనంతలక్ష్మి అనే మహిళ డెడ్‌బాడీని ముందుగా గుర్తించారు. మత్స్యకారుల సాయంతో అనంత లక్ష్మి (40) , కప్పిరెడ్డి ఏసమ్మ (60), కర్రి సునీత (16)గా గుర్తించారు. ఆలయానికి వెళ్తూ ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.