మున్నేరు వాగులో ఈతకు దిగి ముగ్గురు మృతి
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 11:45 AM GMTమున్నేరు వాగులో ఈతకు దిగి ముగ్గురు మృతి
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు సరదాగా ఈత కొట్టేందుకు మున్నేరు వాగు వద్దకు వచ్చారు. లోతు తక్కువగా ఉందనుకుంటూ ముందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి ఐదుగురిలో ముగ్గురు గల్లంతు అయ్యారు.
అయితే.. నీటిలో మునిగిపోతున్న సమయంలో ఐదుగురు యువకులు గట్టిగా కేకలు వేశారు. దాంతో.. అక్కడే ఉన్న కొందరు వీరిని గమనించారు. వెంటనే నీటిలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ముగ్గురు నీటిలో మునిగిపోయారు. ఇద్దరిని మాత్రం స్థానికులు ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. నందిగామ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు మున్నేరు వాగు వద్దకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. కాసేపటికే ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. మృతులను నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన చేజర్ల దినేశ్, యడవల్లి గణేశ్, గాలి సంతోష్ కుమార్‌గా గుర్తించారు. అనంతరం వీరు చనిపోయిన విషయాన్ని వారివారి బంధువులకు తెలియజేశారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.